ముల్లోకాలలో తన విధిని గురించి శ్రీ కృష్ణుడేం చెప్పాడు!
'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (20 - 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 20 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/qf_lVTsqF7g ]
ముల్లోకాలలో తన విధిని గురించి, శ్రీ కృష్ణుడు ఈ విధంగా సంభాషిస్తున్నాడు.
కర్మణైవ హి సంసిద్ధిమాస్థితా జనకాదయః ।
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి ।। 20 ।।
యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః ।
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ।। 21 ।।
తమ ధర్మములను నిర్వర్తించటం ద్వారానే, జనక మహారాజు వంటి వారు, సిద్ధిని పొందారు. ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి, నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను, సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే, ప్రపంచమంతా అనుసరిస్తారు.
జనక మాహారాజు, తన రాజ ధర్మాలను నిర్వర్తిస్తూనే, కర్మయోగం ద్వారా సిద్ధిని పొందాడు. మహోన్నతమైన జ్ఞానోదయ స్థితికి చేరుకున్న తరువాత కూడా, కేవలం ప్రపంచానికి ఒక మంచి ఉదాహరణ చూపటం కోసం, ఆయన తన ప్రాపంచిక విధులను నిర్వర్తించాడు. మహాత్ముల జీవితాలలో ఉన్న ఆదర్శాలను చూసి, మనుష్యజాతి ప్రభావితం అవుతుంది. అటువంటి నాయకులు, తమ నడవడిక ద్వారా, సమాజాన్ని ఉత్తేజపరచి, జనులు అనుసరించడానికి మార్గ దర్శకం అవుతారు. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో, సహజంగానే, మిగతా సమాజం కూడా, నీతి ప్రవర్తనా, నిస్వార్ధం, మరియు ఆధ్యాత్మిక బలంలో పుంజుకుంటారు. కానీ, ఎక్కడ నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో, మిగతా సమాజం కూడా, వారికి అనుసరించే ప్రమాణం లేక, స్వార్ధ పూరితంగా, అనైతికతతో, ఆధ్యాత్మిక అనాసక్తతతో, దిగజారి పోతుంది. ఒక గొప్ప నాయకుడు కర్మ యోగిగా ఉంటే, ఆయనను అనుసరించేవారు, కనీసం తమ కర్మలను చేస్తూ, భాధ్యతలను విధిగా నిర్వర్తిస్తారు. అది తమ మనస్సునీ, ఇంద్రియములనూ నియంత్రణలో ఉంచుకోవడానికీ, మరియు నెమ్మదిగా ఆధ్యాత్మిక స్థాయిలో, ఉన్నత దశను చేరుకోవడానికీ, దోహదపడుతుంది. కాబట్టి, సమాజానికి ఒక ఆదర్శం చూపడం కోసం, అర్జునుడిని, కర్మ యోగం వైపుగా అడుగులు వేయమని, శ్రీ కృష్ణుడు సూచిస్తున్నాడు.
న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన ।
నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ।। 22 ।।
అర్జునా, ఈ మూడు లోకాలలో, నేను చేయవలసిన కర్తవ్యం, పొందవలసినదీ, సాధించవలసినదీ ఏమీ లేదు. అయినా, నేను చేయవలిసిన విధులను చేస్తూనే ఉంటాను.
మనమందరమూ ఎందుకు పని చేస్తున్నామంటే, మనకు ఏదో ప్రతిఫలం కావాలి కాబట్టి. మనమందరమూ, అనంత ఆనంద సముద్రమైన భగవంతుని అణు అంశలం కాబట్టి, ఆనందాన్ని వెతుకుతున్నాము. మనం చేసే ప్రతి పనీ, ఆనందం కోసమే. కానీ, ఆనందం అనేది, భగవంతుని శక్తులలో ఒకటి. అది ఆయనకు మాత్రమే, అనంతమైన మేర ఉంటుంది. తనకు తానే, సమగ్రమైన, పరిపూర్ణుడైన ఆయనకు, బాహ్యమైనదేమీ అవసరం లేదు. మహోన్నత వ్యక్తిత్వంగల వారు కర్మలు చేస్తే, దానికి ఒకే ఒక కారణం ఉంటుంది. అది తమ కోసం కాదు. ఇతరుల సంక్షేమం కోసమే. తన సాకార స్వరూపంలో శ్రీ కృష్ణుడిగా, ఈ విశ్వంలో ఆయన చేయవలసిన కర్తవ్యం ఏమీ లేకపోయినా, లోక హితార్ధం పని చేస్తున్నానని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.
యది హ్యహం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః ।
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 23 ।।
ఓ పార్థా, నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో, అందరు మనుష్యులూ, నా దారినే అనుసరిస్తారు.
ఈ భూలోకంలో తన దివ్య లీలలలో భాగంగా, శ్రీ కృష్ణుడు ఒక గొప్ప నాయకుడిగా, రాజుగా, తన పాత్రను నిర్వహించాడు. ఈ భౌతిక ప్రపంచంలో శ్రీ కృష్ణుడు, అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా, వృష్ణి వంశంలో దర్శనమిచ్చాడు. ఒకవేళ శ్రీ కృష్ణ పరమాత్మయే తన విహిత కర్మలను చేయకపోతే, అలా ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకుంటూ, ఎంతోమంది సామాన్య జనులు, ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. అలా చేస్తే, జనులను తప్పుదారి పట్టించడంలో దోషుడయ్యేది తానే అని, శ్రీ కృష్ణుడు భావిస్తున్నాడు.
ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహమ్ ।
సంకరస్య చ కర్తా స్యాముపహన్యామిమాః ప్రజాః ।। 24 ।।
నేను నా కర్తవ్యములను చేయకపోతే, ఈ సమస్త లోకాలూ నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలానికి నేనే బాధ్యుడనవుతాను. మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది.
శ్రీ కృష్ణుడు ఈ భూలోకంలో, ఒక మానవుడిగా కనిపిస్తూ, అవతరించినప్పుడు, ఆయన రాజ వీరుల కుటుంబీకునిగా, సమాజంలో అన్నివిధాలా తన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాడు. ఆయన అలా చేయకపోతే, ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రుని ప్రవర్తనను అనుకరించాలని, మిగతా జనులు, ఆయన చేసినట్టే చేయ ప్రారంభిస్తారు. శ్రీ కృష్ణుడు వేద విహిత కర్మలు నిర్వర్తించకపోతే, ఆయనను ఆదర్శంగా తీసుకునే మానవులు, కర్మలు చేయవలసిన క్రమశిక్షణ నుండి తప్పిపోయి, గందరగోళ స్థితికి లోనవుతారు. అదే విధంగా, అర్జునుడు యుద్ధంలో అపజయం ఎరుగనివాడని, ప్రపంచ ప్రఖ్యాతినొందాడు. అతను ధర్మాత్ముడైన యుధిష్టిర మహారాజు తమ్ముడు కూడా. అలాంటి అర్జునుడే, తన ధర్మ బద్ధమైన కర్తవ్యమును నెరవేర్చకపోతే, ఏంతో మంది ఉన్నతమైన ఇతర వీరులూ, యోధులూ, ధర్మ పరిరక్షణలో తమకున్న కర్తవ్యమును విడిచి పెట్టవచ్చు. ఇది ప్రపంచ సమతుల్యతని నాశనం చేసి, ధర్మాత్ములూ, అమాయకులూ అయిన ప్రజల వినాశనానికి, కారకమవుతుంది. అందుకే, సమస్త మానవ జాతి కల్యాణం కోసం, తన వేద విహిత విధులను నిర్వర్తించడాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి నచ్చచెప్పుతున్నాడు.
ఇక మన తదుపరి వీడియోలో, జ్ఞానులు కూడా తమ కర్మలను ఎందుకు ఆచరించాలో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
No comments :
Write comments