3.11.21

ఈ రోజు 03/11/2021 - నరకలోక విముక్తి కలిగించే ‘నరక చతుర్దశి’

   

ఈ రోజు 03/11/2021 - నరకలోక విముక్తి కలిగించే ‘నరక చతుర్దశి’

నరకాసుర వధ, స్త్రీ స్వాతంత్ర్యానికి నిదర్శనం. దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం, దీప దానం, యమ తర్పణం వల్ల, నరక బాధలు ఉండవంటారు.

[ అహంకార పట్టులో ఆత్మ తననుతాను ఈ శరీరమే అనుకుంటుంది! = https://youtu.be/0C40lsw2pec ]

ఆశ్వయుజ బహుళ చతుర్దశినే, నరక చతుర్దశి అంటాము. నరక చతుర్దశి తర్వాతి రోజే, దీపావళి. హిందువుల పండుగల్లో, నరక చతుర్దశి, దీపావళి, ప్రముఖమైనవి. హిందూ సంప్రదాయ పండుగల్లో, ఒక రాక్షసుడి మరణాన్ని ఆనందంగా జరుపుకోవడమే, నరక చతుర్దశి విశిష్టత. పండుగలకూ, ఖగోళ సంఘటనలకూ సంబంధం ఉంది. నరకాసుర వధ - చతుర్దశి నాడు (ఆశ్వయుజ బహుళం), ఆకాశంలో రాసుల స్థితిని సూచించేది. తులా రాశి, తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే, పడమటి క్షితిజం మీద, మేషరాశి అస్తమిస్తుంది. నరకుడు భూదేవి కుమారుడు. మేషం సహజంగా మంచిదే అయినా, మూర్ఖత్వ మూర్తి. కాబట్టి, అతడి పాలన అంధకారమయం. ఆ రోజునే, మేష రాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకూ చీకటే.. 

మేష రాశి అస్తమించే వేళకు, తులా రాశి తూర్పు దిక్కున వస్తుంది. స్వాతీ నక్షత్రానికి అధిష్ఠాన దేవత, వాయువు. దాన్ని అధిష్ఠించి, నరకునిపైకి కృష్ణుడూ, సూర్యుడూ, సత్యభామా, చంద్రుడూ బయలుదేరారు. నరకుడు చనిపోగానే, ఆకాశపు అంచులపై దీపఛాయల్లో కన్య రాశి (కన్యల గుంపు), నరకుని బంధాల నుంచి విడివడి, తమకు విముక్తి కలిగించిన సూర్యుడూ, కృష్ణుణ్ని నాయకునిగా చేసుకుంది. ఇలాంటి స్థితి, నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప, మిగిలిన రోజుల్లో లేదు.

నరక భావాలు అంటే, దుర్భావాలను, కృష్ణ భక్తి అనే చక్రాయుధంతో ఖండింపజేసి, జీవుడు భగవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలనేది, ఇందులోని అంతరార్ధం. నరాకాసుర వధ, స్త్రీ స్వాతంత్ర్యానికి నిదర్శనం. దీపావళి ముందు రోజు వచ్చే నరక చతుర్దశి రోజున అభ్యంగన స్నానం, దీప దానం, యమ తర్పణం వల్ల, నరక బాధలు ఉండవంటారు. నరక చతుర్దశిని, ‘ప్రేత చతుర్దశి’ అనే పేరుతోనూ పిలుస్తారు. ఈనాడు నరక ముక్తి కోసం, యమ ధర్మరాజును ఉద్దేశించి, దీప దానం చేయాలని, వ్రత చూడామణి చెబుతోంది. యుముడికి ఎంతో ప్రీతికరమైన చతుర్దశి రోజు, సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకుని, అభ్యంగన స్నానం చేయాలి.

ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో 'లక్ష్మీ', మంచినీటిలో 'గంగాదేవి' కొలువుంటారని, శాస్త్రాలు వివరిస్తున్నాయి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పణం చేయడాన్ని, విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం, దక్షిణాభి ముఖంగా, ‘యమాయయః తర్పయామి’ అంటూ, మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం, ఆచారంగా మారింది. యముణ్ణి పూజించి, మినుములతో చేసిన పదార్థాలు భుజించడం, సూర్యాస్తమయం తర్వాత, ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. నరకలోక వాసులకు పుణ్యలోక ప్రాప్తి కలిగించే ఉత్సవమనీ, అందుకు ఉద్దేశితమైన కార్యకలాప దినమనీ, తమకు నరకలోక భయం లేకుండా చేసుకునే చతుర్దశి యనీ, ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి.

చతుర్దశ్యాంతయే దీపాన్నరకాయ దదంతిచ ।
తేషాం పితృగణా: సర్వే నరకాత్ స్వర్గ మాప్నురయ: ।।

చతుర్దశినాడు ఎవరు నరకలోక వాసులకై దీపాలు వెలిగిస్తారో, వారి పితృ దేవతలు నరకం నుండి స్వర్గం వెళతారని, శాస్త్ర వచనం.

ప్రతీ మాసంలోనూ, బహుళ చతుర్దశి 'మాస శివరాత్రి'. ఆ రోజు, లేదా మర్నాడు తెల్లవారకుండా అభ్యంగన స్నానం చేయరాదనే నిషేధం ఉంది. అయితే, ఆశ్వయుజ బహుళ చతుర్దశికి, అమావాస్య లేదు. పైగా, ఈ రోజున అభ్యంగన స్నానం విధిగా చేయాలని, వ్రత చూడామణి స్పష్టం చేస్తుంది. స్నానం చేస్తుండగా తలచుట్టూ దీపం తిప్పడం, టపాసులు కాల్చడం, ముఖ్య ఆచారం.

తన వధకు ముందు, శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడని తెలుసుకున్న నరకాసురుడు, పరమాత్ముని క్షమాభిక్ష కోరాడు. అందకు పరంధాముడు మన్నించి, నరకుడు చనిపోయిన దినం నాడు స్నానం చేసే వారికీ, పాప విముక్తి కలుగుతుందని వరం ప్రసాదించాడు.

కృష్ణం వందే జగద్గురుం!

No comments :
Write comments