శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన గురువారం తిరుమల, తిరుపతిలోని పలు వేదికలపై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో నిర్వహించిన ధార్మిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
తిరుపతి మహతి కళాక్షేత్రంలో కారైకాల్ కు చెందిన ' నాట్యాలయ భరతనాట్యం' వారు కలైమామణి గురు డా.చిత్రాగోపీనాథ్ 15మందితో కూడిన తమ బృందంతో ప్రదర్శించిన "భరతనాట్య" ప్రదర్శన వీక్షకులను అలరించింది. ఈ నాట్యప్రదర్శనలో - పురందరదాస కీర్తనలైన 'శరణు సిద్ధివినాయక...., జగన్మోహననె కృష్ణ....., జయజయవిఠల పాండురంగ...., వేంకటరమణెనె బారో... 'బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం..' పాటకు నర్తకీమణులు శ్రీనిధి, నిత్యశ్రీ, రియాశ్రీ, అనురాగ, దర్శనీ, జననీ, శ్రీలేఖ ప్రదర్శించిన హావభావాలు సభికులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని, పర్యవేక్షణ గోపీనాథ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు వారు సమర్పించారు.
తిరుమలలోని ఆస్థానమండపంలో ఉదయం వేద సందేశం, ఆర్.వాణిశ్రీ బృందం విష్ణుసహస్రనామపారాయణం, విశాఖకు చెందిన శ్రీ చైతన్య బ్రదర్స్ భక్తి సంగీతం, డా. రాజగోపాలన్ భక్తామృతం ధార్మికోపన్యాసం, సాయంత్రం శ్రీ ఎస్వీ ఆనందభట్టర్ బృందం అన్నమయ్య విన్నపాలు, శ్రీ వై.వెంకటేశ్వర్లు హరికథా పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు.
అన్నమాచార్య కళామందిరంలో ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీమతి చిన్నమ్మదేవి, డా ఎస్.ఉషారాణి బృందం భక్తి సంగీతం భక్తులను మైమరపింపచేసింది.
రామచంద్ర పుష్కరిణి వేదికపై మొదట ఎస్వీ సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు శ్రీ ఎ.చెన్నయ్య అన్నమాచార్య కీర్తనలను తమ వేణుగానంతో సమ్మోహితులను గావించారు. అనంతరం భరతనాట్య అధ్యాపకులు శ్రీ ఎన్.శివప్రసాద్ మార్గదర్శనలో తమశిష్యులచే అన్నమాచార్యుల కీర్తనలైన తందానాన ఆహి, అదివో అల్లదివో ఇత్యాదుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.
No comments :
Write comments