19.10.23

మహతిలో ఆకట్టుకున్న శ్రీనివాసకల్యాణం నాటక ప్రదర్శన













శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన బుధవారం తిరుమ‌ల‌, తిరుప‌తిలోని ప‌లు వేదిక‌ల‌పై టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ధార్మిక, సంగీత కార్య‌క్ర‌మాలు ఆక‌ట్టుకున్నాయి.


 తిరుపతి మహతి కళాక్షేత్రంలో హైదరాబాదుకు చెందిన 'సురభి' శ్రీవినాయక నాట్యకళామండలి వారు శ్రీ ఆర్. వేణుగోపాలరావు 43 మందితో కూడిన తమ బృందంతో గావించిన "శ్రీనివాసకల్యాణం " నాటక ప్రదర్శన సభను సమ్మోహపరచింది.

ఈ నాటకప్రదర్శన ప్రారంభం భూదేవి-నారదుల సంవాదం. భూదేవి పాపజనులవలన కలుషితమైందని ఆవేదన పడడం, నారదుడు వైకుంఠవాసుని కలిసి ఈ విషయం విన్నవించడం భృగుమహర్షికే తగునని తెలుపగా భృగువు బయలుదేరి సత్యలోకంలో బ్రహ్మ పలుకపోవడంతో బ్రహ్మకు భూలోకంలో దేవాలయాలు వుండవని శపించి, కైలాసానికి వెళ్ళి శివుడుధ్యానమగ్నుడై ఉండగా అతని లింగాకృతికి భూలోకంలో పూజలు జరుగునని శపించి, అక్కడనుండి విష్ణుదర్శనం కొరకు వైకుంఠానికి వెళ్ళగా, విష్ణువు తనను పట్టించుకోకపోవడంతో విష్ణు వక్షఃస్థలంపై తన్నడం, విష్ణువు భృగుపాదసేవ చేసినట్లు నటించి అతని కాలిలోని నేత్రాన్ని చిదమడం, అతడు సామాన్యుడు కావడం  ఈ దృశ్యాన్ని గమనించి లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదలి వెళ్ళడం, విష్ణువు లక్ష్మిని వెదకడం, ఆకాశరాజుకు పద్మావతి జనించడం, విష్ణువు పుట్టయందుండడం, పుట్టలో గోవు పాలను స్రవించడం,  దానిని కొట్టడం, అడ్డుకున్న  విష్ణువుకు దెబ్బతగలడం, వారిని శపించడం, గాయం పడ్డ విష్ణువు వకుళమాత చెంతకు చేరడం, తను శ్రీనివాసునిగా  పిలువబడడం, ఉద్యానవనంలో పద్మావతిని చూడడం, ఆపై వారి వివాహం కావడంతో ప్రదర్శన రమ్యంగా జరిగింది.

 రామచంద్రపుష్కరిణి వేదికపై మొదట శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల  శ్రీమతి వేదనారాయణి బృంద వీణాకచేరి, తర్వాత సంధ్యశేఖర్  బృందం సమర్పించిన నృత్యం భక్తిరసవాహినిలో ముంచెత్తింది.                               
                             
తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో ఉద‌యం వేద సందేశం, శ్రీ సంపత్ బృందం విష్ణుస‌హ‌స్ర‌నామ‌పారాయ‌ణం, శ్రీ ఫణికుమార్ బృందం భ‌క్తి సంగీతం, ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టుకు చెందిన శ్రీ సముద్రాల శఠగోపాచార్యులు భ‌క్తామృతం ధార్మికోప‌న్యాసం, సాయంత్రం శ్రీ రఘునాథ్ బృందం అన్న‌మ‌య్య విన్న‌పాలు, రాత్రి శ్రీమ‌తి శ్రావణి బృందం హ‌రిక‌థా పారాయ‌ణం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

అన్న‌మాచార్య క‌ళామందిరంలో శ్రీమతి చిన్నమదేవి, శ్రీ ప్రసాద్ బృందం భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం భ‌క్తుల‌కు భ‌క్తిభావాన్ని పంచింది.

No comments:

Post a Comment