వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 3 నుండి 11వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏప్రిల్ 2వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి 9 గం.ల వరకు అంకురార్పణం, సేనాధిపతి ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఆలయ నేపథ్యం: శ్రీరామచంద్రమూర్తి వాల్మీకి మహర్షికి దివ్యదర్శన భాగ్యాన్ని కలిగించిన ప్రదేశమే వాల్మీకి పురం. లక్ష్మణ, భరత, శతృఘ్న, హనుమంతునితో శ్రీ సీతా సమేతముగా పట్టాభిరాముని పరమ భక్తాగ్రణ్యులైన జాంబవంతులవారు ప్రతిష్టించినట్లుగా తెలియుచున్నది. వల్మీకము (పుట్ట) నుండి శ్రీరామచంద్రమూర్తి బయటపడినందున ఈ ప్రదేశం వాల్మీకి పురంగా పేరొచ్చింది. శ్రీ పట్టాభిరామ స్వామి వారి ఆలయ విమానం సుదర్శన విమానంగా ప్రసిద్ధి చెందింది. ఈ సుదర్శన విమానం చోళరాజుల శైలితోను, మండప ద్వార గోపురములు విజయనగర శైలితోను అత్యంత సుందరంగా నిర్మించబడింది.
తొలి తెలుగు వాగ్గేయ కారులు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వావిలిపాటి శ్రీ పట్టాభిరామునిపై 20కి పైగా కీర్తనలు రచించినట్లు తెలియుచున్నది. శ్రీ పట్టాభి రామాలయమును తిరుమల తిరుపతి దేవస్థానం వారు 23.02.1997వ తేదీన దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి మరమ్మతులు జరిపి 12.08.2005వ తేదీన అష్టబంధన మహా సంప్రోక్షణ నిర్వహించారు. శ్రీ పట్టాభిరామ స్వామి వారికి నిత్యం కైంకర్యాలతో పాటు ప్రతి ఏడాది చైత్ర మాసం నందు నవాహ్నిక బ్రహ్మోత్సవములు, శ్రావణ మాసంలో పట్టాభిషేక మహోత్సవాలు, ఆశ్వీయుజ మాసంలో పవిత్రోత్సవాలు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 03 నుండి 12వ తేదీ వరకు తొమ్మిది రోజులు పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని శ్రీరామచంద్రమూర్తి వివిధ వాహన సేవలను దర్శించుకుని భగవదనుగ్రహానికి పాత్రలు కావాలని టిటిడి కోరుతోంది. ఇప్పటికే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తుదిదశకు చేరాయని టిటిడి పేర్కొంది.
బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు :
తేదీ
03-04-2025
ఉదయం - ధ్వజారోహణం(ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు),
ఉదయం - ధ్వజారోహణం(ఉదయం 8.30 నుండి 9 గంటల వరకు),
రాత్రి - గజవాహనం
04-04-2025
ఉదయం - ముత్యపుపందిరి వాహనం,
రాత్రి - హనుమంత వాహనం
05-04-2025
ఉదయం - కల్పవృక్ష వాహనం,
రాత్రి - సింహ వాహనం
06-04-2025
ఉదయం - సర్వభూపాల వాహనం,
రాత్రి - పెద్ద శేష వాహనం
07-04-2025
ఉదయం - సూర్యప్రభ వాహనం,
రాత్రి - చంద్రప్రభ వాహనం, పల్లకీలో మోహినీ అవతారోత్సవం
08-04-2025
ఉదయం - తిరుచ్చి ఉత్సవం,
రాత్రి - కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు),
గరుడ వాహనం (రాత్రి 11 గంటల నుండి)
గరుడ వాహనం (రాత్రి 11 గంటల నుండి)
09-04-2025
ఉదయం - రథోత్సవం(ఉదయం 9.30 గంటలకు)
రాత్రి - ధూళీ ఉత్సవం( సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు)
10-04-2025
ఉదయం - తిరుచ్చి ఉత్సవం,
రాత్రి - అశ్వవాహనం, పార్వేట ఉత్సవం
11-04-2025
ఉదయం - వసంతోత్సవం (ఉదయం 8 గంటలకు), చక్రస్నానం ( మధ్యాహ్నం 12.05 గంటలకు)
రాత్రి - హంస వాహనం( రాత్రి 8 నుండి 10 గంటల వరకు), ధ్వజావరోహణం(రాత్రి 10 గంటలకు)
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 8న రాత్రి 8 నుండి 10 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం జరుగనుంది. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, రవికె, లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో స్వామి, అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంటల వరకు పుష్పయాగం ఘనంగా జరుగనుంది.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
No comments :
Write comments