27.3.25

ఘనంగా శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య 522వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం










శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతి మహోత్సవాలు టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో బుధ‌వారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఆలపించిన స‌ప్త‌గిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది.

ఉదయం 9 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, స్థానిక కళాకారులు క‌లిసి దిన‌ము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు. ఇందులో ”బ్రహ్మకడిగిన పాదము…., శరణంటూ…, హరి అవతారమితడు అన్నమయ్య.., శరణు శరణు…” కీర్తనలను కళాకారులు ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.
ఉద‌యం 10.30 గంట‌ల‌కు అన్న‌మ‌య్య వంశీయులు చైన్నైకి చెందిన డా. తాళ్ల‌పాక మీన‌లోచ‌ని బృందం అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లను సుమ‌ధురంగా ఆల‌పించారు. త‌రువాత ఉద‌యం 11.30 గంట‌ల‌కు తిరుప‌తికి చెందిన శ్రీ‌మ‌తి జ‌యంతి సావిత్రి బృందం " అన్న‌మ‌య్య జీవిత చ‌రిత్ర " పై హ‌రిక‌థ గానం చేశారు.
సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు తిరుపతికి చెందిన కుమారి అనూష‌, కుమారి ఆర్తి బృందం సంగీత స‌భ‌, రాత్రి 7 నుండి 8.30 గంట‌ల‌కు వ‌ర‌కు ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు భాగ‌వ‌తార్‌ బృందం హ‌రిక‌థ గానం నిర్వహించనున్నారు.
తాళ్ళ‌పాక ధ్యాన‌మందిరం......
తాళ్ళ‌పాక ధ్యాన‌మందిరం వ‌ద్ద బుధ‌వారం ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు తిరుప‌తికి చెందిన శ్రీ ఉద‌య్ భాస్క‌ర్‌, శ్రీ‌మ‌తి లావ‌ణ్య‌ బృందం సంగీత సభ, రాత్రి 8 నుండి 9.30 గంటల వ‌ర‌కు తిరుపతికి చెందిన శ్రీ ర‌మేష్ బాబు బృందం హరికథ గానం చేయనున్నారు.
అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద......
రాజంపేట-కడప హైవేలో ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద బుద‌వారం సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ స‌ర‌స్వ‌తీ ప్ర‌సాద్‌, శ్రీ‌మ‌తి భార్గ‌వి బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపించనున్నారు. రాత్రి 8 నుండి 9.30 గంట‌ల వ‌ర‌కు తిరుప‌తికి చెందిన వెంక‌ట కృష్ణ‌య్య బృందం హరికథ కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు శ్రీ రాజ‌గోపాల‌రావు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments