29.3.25

అన్నమయ్య కీర్తనలతో సామాజిక చైతన్యం : ఆచార్య సర్వోత్తమరావు







సమాజంలో విలువలను పునరుద్ధరించి, సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యం పెంచేందుకు అన్నమయ్య కీర్తనలు ఎంతగానో దోహదపడతాయని ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు సర్వోత్తమరావు పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న సాహితీ సదస్సులు శుక్రవారం రెండో రోజుకు చేరుకున్నాయి.

ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య సర్వోత్తమరావు ''అన్నమయ్య సంకీర్తనలు - సామాజిక దృష్టి'' అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాటి సామాజిక ప‌రిస్థితుల్లో అన్ని వృత్తుల వారు స‌మాన‌మేన‌ని, రాజు - పేద తేడాలు ఉండ‌కూడ‌ద‌ని, అంద‌రికీ శ్రీ‌హ‌రే అంత‌రాత్మ అని అన్న‌మ‌య్య తెలియ‌జేశార‌ని చెప్పారు. ఆశ్ర‌మ‌ ధ‌ర్మాల్లో గృహ‌స్తాశ్ర‌మ గొప్ప‌ద‌నాన్ని సంకీర్త‌న ద్వారా తెలియ‌జేశార‌న్నారు. పలు సంకీర్తనల్లో రాయలసీమ మండలికానికి పెద్దపీట వేశారని చెప్పారు. అన్నమయ్య కీర్తన‌లను చదివినా, విన్నా వ్యక్తిత్వ వికాసం క‌లుగుతుంద‌ని తెలిపారు. ఈ విషయాలను సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారని వివరించారు.
శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల తెలుగు అధ్యాపకులు శ్రీమతి కృష్ణవేణి ''అన్నమయ్య సంకీర్తనలు - పురాణ గాథలు '' అనే అంశంపై ఉపన్యాసిస్తూ, హంపిలో 1400వ సంవత్సరానికి శ్రీ నారసింహ ఆలయం ఉన్నట్లు, అన్నమయ్య 64 కీర్తనలలో శ్రీ నారసింహస్వామిని కీర్తించినట్లు వివరించారు. రాముడు మాధవుడుగా అవతరించెను అని శ్రీరామచంద్రమూర్తిని అన్నమయ్య కీర్తిస్తూ ప్రజల్లో భక్తి భావాలను చేరవేశారన్నారు. రామచంద్రుడితను రఘువీరుడితను అని రామాయణాన్ని నరనరాన, జానపదాల్లో రామాయణాన్ని ఉచ్చరించారని మాట్లాడారు. అన్నమయ్య హంపిలోని వివిధ ఆలయాలను దర్శించి నాటి వైభవాన్ని, సామాజిక జీవనాన్ని కూడా అద్భుతంగా వర్ణించారని తెలిపారు. అన్నమయ్య దర్శించిన క్షేత్రాలు, ప్రాంతాలను సంకీర్తనల్లో పొందుపరచడం వల్ల ఆనాటి చరిత్రను తెలియజేశారని తెలిపారు. అప్పటి వరకు ఉన్న పద్య, గద్యం కాకుండా పద కవితలతో జన బాహుళ్యంలోకి భక్తి తత్వన్ని తీసుకు వెళ్ళిన్నట్లు తెలిపారు.
జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ నల్లన్న ''పోతన - అన్నమయ్య '' అనే అంశంపై ఉపన్యసిస్తూ పరమ భాగవతోత్తముడైన పోతన పద్య రచన ద్వారా శ్రీ మహావిష్ణువును కీర్తించగా, హరి కీర్తనాచార్యుడైన అన్నమయ్య పద సాహిత్యంద్వారా ఆ దేవదేవుని కీర్తించారని అన్నారు. అన్నమయ్య కీర్తనల్లో భక్తి కన్నా ఆర్తి ఎక్కువగా ఉంటుందన్నారు. పోతన కవిత్వంలో భక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉందని తెలిపారు. అన్నమయ్య, పోతన ఒకే కాలానికి చెందిన వారని, ఇద్దరిదీ వ్యవసాయ కుటుంబమేనని తెలిపారు. జీవాత్మను పరమాత్మలో ఐక్యం చేయడమే లక్ష్యంగా వీరు రచనలు చేశారని వివరించారు.
అనంతరం సాయంత్రం 6 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఆనంద బట్టర్ బృందం సంగీత సభ, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులచే వాయిద్య సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.
అంతకుముందు ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి బుల్లెమ్మ బృందం గాత్ర సంగీతం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఇంఛార్జి సంచాలకులు శ్రీ కె.రాజగోపాల రావు, అధికారులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.

No comments :
Write comments