తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానం సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి, పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు.
మార్చి 30వ తేదీ ఉగాది సందర్భంగా సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు ఆస్థానం వైభవంగా జరుగనుంది. ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుండి నూతన వస్త్రాలు తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తారు. అనంతరం ఆలయంలో పంచాంగ శ్రవణం, ఆస్థానం ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ శ్రీ చిరంజీవి, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాధాకృష్ణ, అర్చక బృందం పాల్గొన్నారు.
No comments :
Write comments