తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
కంకణ బట్టర్ శ్రీ భరత్ కుమార్ దీక్షితులు ఆధ్వర్యంలో ఉదయం 9.15 నుండి 9.30 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో గరుత్మంతుని చిత్రంతో కూడిన ధ్వజపటానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, భక్తుల గోవింద నామస్మరణ, రామనామ జపముల మధ్య ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపైకి అధిష్టింపచేశారు. సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడంతోపాటు సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుందని అర్చకులు తెలిపారు.
అంతకుముందు ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారు, ధ్వజపటము, చక్రతాళ్వారులకు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు ఆస్థానం జరిగింది.
తరువాత ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.
కాగా, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు పెద్దశేష వాహన సేవ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులలో ఒకరైన శ్రీ వేణుగోపాల దీక్షితులు, టీటీడీ ఆగమ సలహాదారు శ్రీ సీతారామాచార్యులు, డెప్యూటీ ఈవోలు శ్రీ గోవిందరాజన్, శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ ముని శంకరన్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ సురేష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments