13.4.25

వైభవంగా తుంబురు తీర్థ ముక్కోటి తీర్థ స్నానమాచరించిన 14,500పైగా భక్తులు




తిరుమలలోని శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థంగా భాసిల్లుతున్న తుంబురు తీర్థ ముక్కోటిలో దాదాపు 14,500 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 11న సుమారు 3,500 మంది, ఏప్రిల్ 12న 11వేల మంది భక్తులు తీర్థ స్నానం ఆచరించారు.
టీటీడీ విస్తృత ఏర్పాట్లు 
టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆదేశాల మేరకు అధికారులు తుంబురు తీర్థానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ ఉదయం 5 గంట‌ల నుండి నిరంత‌రాయంగా అన్న ప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు భక్తులకు శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు.
ఇంజినీంగ్‌ విభాగం ఆధ్వర్యంలో భక్తులు భోజనం చేసేందుకు వీలుగా అవసరమైన షెడ్లు, మార్గమధ్యంలో నిచ్చెనలు, తాగునీటి కొళాయిలు ఏర్పాటు చేశారు. దీర్ఘకాలిక వ్యాధులు, ఆస్తమా, స్థూల కాయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారిని తీర్థానికి అనుమతించలేదు. పాప వినాశనం వద్ద పార్కింగ్ సమస్య కారణంగా భక్తులను ఆర్టీసీ బస్సులలో మాత్రమే అనుమతించారు. తుంబురు తీర్థానికి అటవీ మార్గంలో వెళ్ళే సమయంలో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రేడియో మరియు బ్రాడ్‌కాస్టింగ్‌ విభాగం ఆధ్వర్యంలో నిరంతరాయంగా ప్రకటనలు చేశారు.
ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో తుంబురు తీర్థం, పాపావినాశనం వద్ద పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ అదనపు సిబ్బందిని నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సేవలందించేందుకు అంబులెన్స్‌లను, పారామెడికల్‌ సిబ్బందిని అవసరమైన మందులు అందుబాటులో ఉంచారు. మరోవైపు టీటీడీ భద్రతా విభాగం, పోలీసులు, అటవీశాఖ సిబ్బంది కలసి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
టీటీడీ కల్పించిన అన్నప్రసాదాలు, తాగునీరు, ఇతర ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.
టీటీడీ చేసిన ఏర్పాట్లను డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, వీజీవో శ్రీ సురేంద్ర, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మధుసూదన్, వైద్య అధికారి డాక్టర్ కుసుమ కుమారి, తదితరులు పర్యవేక్షించారు.

No comments :
Write comments