12.4.25

బడుగుల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబా పూలే : ఐటి అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీ యాద‌గిరి - మ‌హ‌తిలో ఘన‌గా 198వ జ‌యంతి ఉత్స‌వం






బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే అని హైదరాబాద్ ఇన్‌క‌మ్ ట్యాక్స్‌ అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీ యాద‌గిరి అభివర్ణించారు. మ‌హాత్మ జ్యోతిబా పూలే 198వ జ‌యంతి ఉత్స‌వం శుక్ర‌వారం తిరుప‌తి మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ఘ‌నంగా జ‌రిగింది.


 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ యాద‌గిరి మాట్లాడుతూ, మహారాష్ట్రలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జ్యోతిబాఫూలే వర్ణ వ్యవస్థతో కునారిల్లుతున్న సమాజానికి సంస్కారం నేర్పారని కొనియాడారు. అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్య సరైన ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్పారని, స్త్రీ విద్యను ప్రోత్సహించారని, బాల్య వివాహలను వ్యతిరేకించి, వితంతు పునర్వివాహానికి నాంది పలికారని వివరించారు.

 గుంటూరుకు చెందిన సౌత్ సెంట్రల్ ఓబీసీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ వెనకబాటు, కులతత్వం తదితర అనేక కారణాల వల్ల భారతీయ సమాజం ఇతర సమాజాల కంటే సంక్లిష్టమైందన్నారు. గౌతమ బుద్ధుడు మొట్టమొదట్టి సామజిక విప్లవకారుడని, తరువాతకాలంలో మహాత్మ జ్యోతిబాపూలే సామజిక విప్లవకారుడిగా అవతరించి బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, నిమ్న వర్గాలు అభివృద్ధి చెందాలంటే విద్య అవసరమని ఆనాడే గుర్తించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని వివరించారు.  

 టిటిడి బోర్డు స‌భ్యులు శ్రీ జంగా క్రిష్ణ‌మూర్తి మాట్లాడుతూ, పూలే భారతదేశంలో మహోన్నత సంఘసంస్కర్త అని, పూలే దంపతులు సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారన్నారు.  ఫూలే తన భార్య సావిత్రి బాయికి విద్యాబుద్ధులు నేర్పించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారని చెప్పారు. ఆమె స్ఫూర్తితోనే ప్రస్తుతం మహిళలు ఉన్నత విద్యావంతులై అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. ఎందరో మహానుభావులు పూలేను తమ గురువుగా భావించారన్నారు.    

అనంత‌రం టీటీడీలోని ప‌లు విభాగాల‌లో విశిష్ట సేవలు అందించిన 45  మంది బీసీ ఉద్యోగులను  స‌న్మానించారు.

ఈ కార్యక్రమంలో బోర్డు స‌భ్యులు శ్రీ శాంతారామ్, శ్రీ నరేష్ కుమార్ , డెప్యూటీ ఈవో శ్రీ ఆనంద రాజు, ఎస్‌సి, ఎస్టీ, బీసీయూనియన్‌ నాయకులు, ఇతర అధికార ప్రముఖులు, టీటీడీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments :
Write comments