- ప్రత్యేకంగా వడపప్పు-పానకం పంపిణీ
– నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ ఏర్పాటు
ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే వేలాది మంది భక్తులకు నిరంతరాయంగా రుచికరమైన అన్నప్రసాదాలను టీటీడీ అందిస్తోంది.
స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ అందిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎండ వేడిమి నుండి భక్తులకు ఇబ్బంది లేకుండా జర్మన్ షెడ్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి రోజు ఉదయం 7 30 గంటలకు అల్పాహారం, ఉదయం 10.30 నుండి సాయంత్రం 4 గంటల వరకు, సాయంత్రం 6.30 నుండి రాత్రి 10.30 గంటల వరకు రుచికరమైన అన్నం, సాంబరు, రసం, మజ్జిగ, పచ్చడి, కర్రీ, బెల్లం పొంగలి అందిస్తారు
ఇందుకోసం దాదాపు 50 మంది టీటీడీ అన్నప్రసాదం విభాగం సిబ్బంది పనిచేస్తున్నారు.
వడపప్పు-పానకం పంపిణీ :
శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఆలయ ప్రాంగణంలో శ్రీవారి సేవకుల ద్వారా ఉదయం నుండి వడపప్పు - పానకం పంపిణీ చేస్తున్నారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వడపప్పు - పానకం స్వీకరిస్తున్నారు.
పానకం అనేది బెల్లం, నల్ల మిరియాలు, ఏలకులు మరియు నీటితో తయారు చేయబడిన దక్షిణ భారత దేశ సాంప్రదాయ పానీయం. వడ పప్పు అనేది శ్రీరామ నవమి పండుగ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తారు. దీనిని పెసర పప్పు, తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పుతో తయారు చేస్తారు. దక్షిణ భారత దేశంలోని దేవాలయాలలో శ్రీరామ నవమి సమయంలో శ్రీరాముడికి పెద్ద కుండలలో పానకం, వడ పప్పు నైవేద్యంగా సమర్పించిన తరువాత భక్తులకు పంచిపెడతారు. శ్రీరామ నవమి ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో 9వ రోజున వస్తుంది.
No comments :
Write comments