20.4.25

కేంద్రీయ విచారణ కార్యాలయం పునర్వ్యవస్థీకరణపై టీటీడీ ఈవో సమీక్ష







తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా కేంద్రీయ విచారణ కార్యాలయంలో మెరుగైన వసతులు కల్పించేందుకు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామల రావు అదనపు ఈఓ శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరితో కలిసి శనివారం తిరుమలలోని అన్నమయ్య భవన్ లో కేంద్రీయ విచారణ కార్యాలయం పునర్వ్యవస్థీకరణపై సమీక్ష నిర్వహించారు.

తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం భక్తులకు వసతి, దర్శన టికెట్లు, ఇతర అవసరమైన సేవలను అందించే ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. అయితే గత కొంత కాలంగా, ముఖ్యంగా రద్దీ సమయంలో సీఆర్వోకు అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు.
ఈ భవనాన్ని చాలా దశాబ్దాల క్రితం నిర్మించడంతో రోజురోజుకీ పెరిగిపోతున్న భక్తుల సంఖ్యత తీవ్ర అసౌకర్యాలకు గురవుతున్నారు.
ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌కు చెందిన ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్ డాక్టర్ జి.కార్తీక్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపొందించి సమగ్ర పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను టీటీడీ అధికారులకు వివరించారు.
ఈ ప్రజెంటేషన్‌లో భక్తుల రాకపోకలను సులభతరం చేయడం, స్థల వినియోగాన్ని సమర్ధవంతంగా చేసుకోవడం, సిఆర్వో, పీఏసీ-1 ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై లోతైన అధ్యయనం చేసి పలు ప్రతిపాదనలను వెల్లడించారు.
ఈ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక తిరుమల ఏడుకొండల ఆధ్యాత్మిక మహత్యాన్ని, పర్యావరణానికి అనుగుణమైన నగర ప్రణాళికా సూత్రాలను సమన్వయం చేస్తూ రూపొందించబడింది.
ఈ సందర్భంగా ఈఓ శ్రీ శ్యామలరావు మాట్లాడుతూ ప్రత్యేక క్యూ లైన్లు, భక్తులు వేచి ఉండే ప్రాంతాలు, ప్రస్తుత భవనాల పునరుద్ధరణ వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఈ ప్రణాళిక టీటీడీ దీర్ఘకాలిక మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా కూడా ఉండాలని సూచించారు.
ప్రస్తుత రద్దీ పరిస్థితులను చక్కదిద్దడం , కొన్ని దశాబ్దాలుగా ఉన్న భవనాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, అలాగే వచ్చే కొన్ని దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ఈ ప్రణాళిక యొక్క ముఖ్య ఉద్దేశమని ఈఓ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ సత్యనారాయణ, టీటీడీ పట్టణ ప్రణాళిక- డిజైన్ నిపుణులు శ్రీ రాముడు, తిరుమల ఎస్టేట్ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్, వీ జీవోలు శ్రీరాంకుమార్, శ్రీ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

No comments :
Write comments