21.4.25

ద‌ర్శ‌న టోకెన్లు, టికెట్లు క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే రావాలి









శ్రీవారి ద‌ర్శ‌న టోకెన్లు, టికెట్లు క‌లిగిన భ‌క్తులు నిర్దేశిత స‌మ‌యంలోనే ద‌ర్శ‌న క్యూలైన్ల‌లోకి ప్ర‌వేశించాల‌ని టీటీడీ అద‌న‌పు ఈవో శ్రీ సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి కోరారు. తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ పెర‌గ‌డంతో ఆదివారం రాత్రి ఆయ‌న స‌ర్వ ద‌ర్శ‌న క్యూలైన్ల‌ను ప‌రిశీలించారు.

టీబీసీ, ఏటీసీ వ‌ద్ద క్యూలైన్ల‌లో భ‌క్తుల‌కు చేసిన ఏర్పాట్ల‌ను త‌నిఖీ చేశారు. క్యూలైన్ల‌లోని భ‌క్తుల‌కు సౌక‌ర్య‌వంతంగా అన్నప్ర‌సాదాలు పంపిణీ చేసేందుకు ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహిక‌ల్స్ ను ఆయ‌న ప‌రిశీలించి భ‌క్తుల‌కు ఇబ్బంది త‌లెత్త‌కుండా అన్న ప్ర‌సాదాలు అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. క్యూ లైన్ లో టీటీడీ కల్పించే సౌకర్యాలపై భ‌క్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు,వారంతపు సెలవుల నేపథ్యంలో తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పారు. నూత‌నంగా ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా భక్తులకు నిరంత‌రాయంగా అన్న ప్రసాదాలు అందిస్తున్నామ‌ని తెలిపారు. స‌ర్వ ద‌ర్శ‌నం, ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం, స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్లు క‌లిగిన భ‌క్తుల‌కు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా స‌మ‌న్వ‌యంతో ద‌ర్శ‌నాలు క‌ల్పిస్తున్నామ‌ని తెలియ‌జేశారు.
ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర‌, వీజీవో శ్రీ సురేంద్ర‌, క్యాటరింగ్ అధికారి శ్రీ శాస్త్రి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

No comments :
Write comments