8.4.25

పండుగ వాతావరణంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి








ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవం పండుగ వాతావరణంలో భక్తులందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి సూచించారు.

ఈ సందర్భంగా ఒంటిమిట్ట లోని పరిపాలనా జరిగిన సమీక్షాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అయ్యాక రాష్ట్ర దేవాదాయ శాఖ నుండి ఒంటిమిట్ట ఏకశిలానగరాన్ని 2015లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టిటిడిలో విలీనం చేశారని, అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో టిటిడి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని గుర్తు చేశారు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనలతో తొలిసారి శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఆలయాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.
శ్రీ నారా చంద్ర బాబు నాయుడు ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిపించాలని, అన్నమయ్య నివసించిన ప్రాంతం కనుక ఇక్కడే టీటీడీ ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు భావించారని గుర్తు చేశారు. 
ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని నిర్ణయించారని తెలిపారు. 
రాష్ట్ర ప్రభుత్వ పండుగకు ముత్యాల తలంబ్రాలు సమర్పించదానికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని వెల్లడించారు.
ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అందుకు తగ్గట్టుగా టిటిడి , జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను కోరారు. సీఎం గారు వచ్చి వెళ్లేంత వరకు పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరారు. హైవే సెక్టార్ లలో తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల నుండి అంబులెన్స్ లను అదనంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 
సీసీ కెమెరాలు , డ్రోన్ కెమెరాలు పెంచాలని, వేసవి నేపథ్యంలో  ఫైర్ సర్వీస్ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తులు వెలుపలికి సులువుగా వచ్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని, పార్కింగ్ కొరకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఒంటిమిట్ట ఆలయాన్ని ఒక గొప్ప పుణ్య క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు కడప జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీమతి ఎస్. సవిత మాట్లాడుతూ, అందరూ కలిసి కట్టుగా సమిష్టిగా పనిచేసి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. కల్యాణ వేదిక ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో జరిగిన సమీక్షలో కల్యాణ వేదిక వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంత్రులు సూచించారు. గ్యాలరీల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులు ఇతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో చర్చించారు. కడప జిల్లా ఎస్పీతో సమన్వయం చేసుకుని పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది పటిష్ట బందోబస్తు, సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ కు ఇబ్బంది లేకుండా, వాహనాల పార్కింగ్‌, భక్తుల అవసరాలకు తగినన్ని ఆర్ టిసి బస్సులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కళ్యాణ వేదిక వద్ద బారికేడ్లు, అన్న ప్రసాదము కౌంటర్లు, లైటింగ్, వైద్యశిబిరాలు, మరుగుదొడ్లు, అదనపు పారిశుద్ధ్య సిబ్బంది తదితర అంశాలపై చర్చించారు.
సమీక్షకు ముందు కల్యాణోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రులకు జిల్లా కలెక్టర్, టిటిడి జేఈవో, జిల్లా ఎస్పీ, టిటిడి సివిఎస్వో లు నివేదించారు.
అంతకుముందు కల్యాణ ప్రాంగణం వద్ద భక్తుల కోసం చేపడుతున్న ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, శ్రీ ఎం. రామ్ ప్రసాద్ రెడ్డి, శ్రీమతి ఎస్. సవిత జిల్లా కలెక్టర్ శ్రీ సి. శ్రీధర్, జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్, టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ హర్షవర్ధన్ రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ సర్వశ్రీ అదితి సింగ్ తదితర ఉన్నతాధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు.
ముందుగా రాష్ట్ర మంత్రులు శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న మంత్రులకు టీటీడీ జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా పూర్ణకుంభం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ మండపంలో జేఈవో మంత్రులకు శేష వస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.
ఈ స‌మావేశంలో టిటిడి సీఈ శ్రీ సత్యనారాయణ, ఆర్డీవో శ్రీ జాన్ ఎర్విన్, జిల్లా రెవిన్యూ, పోలీసు, హెల్త్, మెడికల్, తదితర పలువురు జిల్లా, టిటిడి అధికారులు పాల్గొన్నారు 

No comments :
Write comments