పవిత్ర పుణ్య క్షేత్రమైన తిరుమలలో భక్తులు తాము ప్రయాణం చేసే వాహనాల నుండి రోడ్లపై చెత్తను విసరడం మానుకోవాలని టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమలలో భాగంగా శనివారం ఉదయం మొదటి ఘాట్ రోడ్ లోని కుంకాల పాయింట్ (ఆఖరి మెట్టు) వద్ద ఆయన సిబ్బందితో స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించి కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉన్నప్పటికీ వాహనదారులు ప్లాస్టిక్ కవర్లు, తిను బండారాలు, వాటర్ బాటిళ్లను తీసుకొచ్చి రోడ్ల పక్కన విసిరి వేస్తున్నారని చెప్పారు. దీంతో కొంతకాలంగా పెద్ద ఎత్తున చెత్త పోగయ్యిందని తెలిపారు. స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమలలో భాగంగా మొదటి ఘాట్ రోడ్డులో ఈ చెత్తను తొలగించాలని నిర్ణయించామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో 400 మంది టీటీడీ సిబ్బందితో పాటు పోలీసులు, తిరుమల స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగమయ్యారని చెప్పారు.
చెత్తను శుభ్రం చేయడంతో పాటు భవిష్యత్తులో రోడ్డుపై చెత్త విసరకుండా డస్ట్ బిన్ లు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులందరూ ఆ డస్ట్ బిన్ లలో చెత్త వేయాలి తప్పా వాహనంలో ప్రయాణిస్తూ రోడ్డుపై చెత్త విసరడం మంచి పద్ధతి కాదని అన్నారు.
తిరుమలను పరిశుభ్రంగా ఉంచేందుకు 6వేల మంది సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తున్నారని, వారి కృషిని, తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాల నుండి బయటకు చెత్త విసరడం మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తులందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని, స్వచ్ఛాంధ్ర-స్వచ్ఛ తిరుమల కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
అనంతరం ఆయన ఈ సందర్బంగా దిగువ ఘాట్ మార్గంలో ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెత్త తొలిగించే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సిఈ శ్రీ సత్యనారాయణ, డిప్యూటీ ఈవో శ్రీ రాజేంద్ర, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు, హెల్త్ ఆఫీసర్ శ్రీ మధుసూదన్, వీజీవోలు శ్రీ సురేంద్ర, శ్రీమతి సదాలక్ష్మీ, ఇతర పోలీసు అధికారులు, పలు శ్రీవారి సేవకులు, విద్యార్థులు స్వచ్చందంగా పాల్గొన్నారు.
No comments :
Write comments