టిటిడి గోశాలలో ఇటీవల 100 గోవులు మృతి చెందాయంటూ టిటిడి మాజీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయని టిటిడి ఛైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు మాట్లాడారు. ఆదివారం టిటిడి గోశాలలో గోవులను, గోవుల ఆవాసాలను, వాటికి రోజువారీ అందించే దాణాను మీడియా, అధికారులతో కలసి పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
టిటిడి గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని, గోవులను తల్లిలా భావించి ఎప్పటికప్పుడు దాణా, అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా ఎక్కడో మృతి చెందిన గోవుల ఫోటోలను, గత పాలనలో గోశాలలో మరణించిన గోవుల ఫోటోలను చూపి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలనలో మరణించిన గోవుల ఫోటోలను, తేదీలను మార్చి ప్రస్తుతం చనిపోయినట్లు చూపిన ఫోటోలను మీడియాకు చూపించారు.
టిటిడి ఛైర్మన్ గా కరుణాకర్ రెడ్డి ఉండగా గోవులకు కాలం చెల్లిన మందులు, పురుగులు పడ్డ దాణా పంపిణీ చేసినట్లు వారి పాలనలో విజిలెన్స్ నివేదికే స్పష్టం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా అప్పటి విజిలెన్స్ నివేదికను, అందుకు సంబంధించిన ఫోటోలను మీడియాకు చూపించారు. ప్రతీ రోజూ అసత్య ఆరోపణలు, పచ్చి అపద్దాలతో టిటిడి సంస్థ మీద బురద చల్లుతూ రాజకీయ లబ్ది పొందాలని చూస్తే జీరో అవుతారని హెచ్చరించారు. వ్యక్తిగతంగా నా మీద ఏమైనా ఉంటే ఆరోపించుకో కానీ దైవ సంస్థ మీద అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు.
టిటిడి గోశాలలో గోవుల సహజ మరణాలను ఆయన సొంత రాజకీయాల కోసం వాడుకోవాలని కుట్రలు చేస్తే శ్రీవేంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఊరుకోరన్నారు. ఇతర మతాల విశ్వాసాల మీద అసత్య ప్రచారాలను ఇలాగే చేయగలవా అని, హిందువులపై ఎందుకంత ధ్వేషమని ఆయన ప్రశ్నించారు.
కరుణాకర్ రెడ్డికి దేవుడు అంటే భయం లేదు, భక్తి లేకనే రోజూ ఏదో ఒక విధంగా అపద్దాలను మాట్లాడుతున్నారన్నారు. టిటిడి సంస్థపై ఏదైనా నిజాలు చెబితే సరిదిద్దుకుంటామని కానీ బురద చల్లితే ఊరుకోమన్నారు.
నేను ఛైర్మన్ అయ్యాక గత పాలనలో జరిగిన ఇంజనీరింగ్ పనులపై ఆరా తీస్తుంటే అడుగడుగునా కమిషన్ల భాగోతమమేనని, కాంట్రాక్టర్లు అందరూ వచ్చి మేము కమీషన్లు ఇచ్చాం, మా సంగతేంటని అడుగుతున్నారని, అయితే ఆయన టిటిడి కమీషన్ల ఛైర్మన్ గా కరుణాకర్ రెడ్డి అపకీర్తి మూటగట్టుకున్నారని విమర్శించారు.
తాను ఛైర్మన్ అయ్యాక ఒక రూపాయి కూడా అవినీతి మరక లేకుండా ఛైర్మన్ గా సేవలు అందిస్తున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నాని, టిటిడి బోర్డు సభ్యులు శ్రీ జీ. భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడారు.
No comments :
Write comments