అణగారిన వర్గాల ఆత్మ బంధువు డా|| బి.ఆర్.అంబేద్కర్ అని భారతదేశంలో కుల వ్యవస్థను నిర్మూలించి అందరికి సమాన అవకాశాలు కల్పించిన మహానుభావుడని, దళితులు, వెనుకబడిన వర్గాలు, స్త్రీలకు కూడా ఉన్నత అవకాశాలు కల్పించినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని హైదరాబాద్ కు చెందిన ప్రముఖ న్యాయ నిపుణులు శ్రీ శ్రీకాంత్ పేర్కొన్నారు. అంబేద్కర్ 134వ జయంతిని సోమవారం ఉదయం తిరుపతి మహతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రతికూల పరిస్థితులలో కూడా అట్టడుగు స్థాయి నుండి భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగిన అంబేద్కర్‌ను భారతీయులందరూ ఆదర్శంగా భావించాలన్నారు. ఆయనకు అన్ని శాస్త్రాల్లో విస్తృతమైన పరిజ్ఞానం ఉండేదని తెలిపారు. హైందవ సమాజం ఎల్లప్పుడూ సర్వసమానత్వాన్నే బోధిస్తుందని, ఎలాంటి అసమానతలు లేని సమాజం కోసం ఉద్యమించిన మహానాయకుడని వివరించారు.
అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్య సరైన ఆయుధమని భావించి, అందుకు అవసరమైన చట్టాలను తీసుకువచ్చినట్లు తెలిపారు. మన ఆలోచన విధానం మారిన నాడే అంబేద్కర్ ఆశయాలు సిద్ధిస్తాయని తెలిపారు. అంబేద్కర్ కృషి వల్లనే సగటు భారతీయుడు నేడు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అనుభవించగలుగుతున్నారని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్‌ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరారు.
అనంతరం విజయవాడకు చెందిన ప్రముఖ పాత్రికేయులు శ్రీ విద్యా సాగర్ రావు ప్రసంగిస్తూ, అంబేద్కర్ మహనీయుడు కావడం వెనక సమాజంలోని అన్ని వర్గాల వారి సహకారం ఉందన్నారు. కష్టపడేతత్వం ఉంటే
ఎవరైనా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని తెలిపారు. భారతదేశ ప్రజలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని నిర్మించారని తెలిపారు. అంబేద్కర్ రచనలను చదివితే ఒక దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రగతికి అవసరమయ్యే అన్ని అంశాలను తెలుసుకోవచ్చన్నారు.
దళితులు విద్యనభ్యసించి చైతన్య వంతులైనప్పుడే సమాజంలో అంతరాలు తొలగిపోతాయని తెలియజేశారు. ఆయన స్ఫూర్తితో జీవితాన్ని అభివృద్ధిచేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించి, సమసమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. దళిత, గిరిజనులను గౌరవిస్తూ టిటిడి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు.
అనంతరం పలువురు టిటిడి ఉద్యోగులు ప్రసంగించారు.
తర్వాత టిటిడి లోని అన్ని విభాగాల్లో ప్రతిభ కనబరిచిన 45 మంది ఉద్యోగులకు మెమెంటోలు అందజేశారు.
అంతకుముందు డిప్యూటీ ఈవో శ్రీ ఆనంద రాజు శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, డా|| బి.ఆర్.అంబేద్కర్ పటానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు శ్రీ దేవేంద్ర బాబు, శ్రీ లక్ష్మణ్ నాయక్, ఇతర అధికార ప్రముఖులు, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.
No comments :
Write comments