తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం స్వామివారు ఏడుచుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు .
ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం 9 నుండి 10 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు.
ఉదయం 10 నుండి 11 గంటల వరకు ఉత్సవర్లకు సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు ఆశీనులై పుష్కరిణిలో 7 చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, ఏఈవో శ్రీ రవి, సూపరింటెండెంట్ శ్రీ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ సురేష్, ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
No comments :
Write comments