6.4.25

జగ్జీవన్‌రామ్‌ జీవితం స్ఫూర్తివంతమైనది : ⁠డా. రాంప్రసాద్









భారత జాతీయోద్యమంలో పాల్గొని స్వాతంత్య్రం తరువాత కేంద్రమంత్రిగా విశేష సేవలు అందించిన డా|| బాబు జగ్జీవన్‌రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకమైనదని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాంప్రసాద్ పేర్కొన్నారు. జగ్జీవన్‌రామ్‌ 118వ జయంతి వేడుకలను తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో శనివారం ఘనంగా నిర్వహించారు.

 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాంప్రసాద్ ప్రసంగిస్తూ, 1908వ సంవత్సరంలో బీహార్‌లోని చాంద్వా గ్రామంలో జన్మించిన బాబు జగ్జీవన్‌రామ్‌ గొప్ప మానవతావాది అని కొనియాడారు. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అయిన ఈయన కష్టపడి చదువుకుని సంఘ సంస్కర్తగా, రాజకీయవేత్తగా ఎదిగారని తెలియజేశారు. కేంద్రంలో కార్మికశాఖ, వ్యవసాయ శాఖ, రక్షణ శాఖలను సమర్థవంతంగా నిర్వహించి ఉప ప్రధానిగా దేశానికి ఎనలేని సేవలందించారని తెలిపారు. ఇలాంటి నాయకుల జయంతి సభల ద్వారా వారు చేసిన మంచి పనులు తెలుసుకుని, ఆ మార్గంలో నడిచేందుకు స్ఫూర్తి పొందాలని ఉద్యోగులకు సూచించారు. 
 
 మ‌రో ముఖ్య వ‌క్త బద్వేలు ఎస్ బివిఆర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటసుబ్బయ్య ఉప‌న్య‌సిస్తూ, బహుజనులు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని, ఇందుకోసం నిరంతరం స్ఫూర్తి పొందాలని కోరారు. డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్ రాజ్యాంగ సభ సభ్యుడిగా దళితుల సామాజిక, రాజకీయ హక్కుల కోసం గట్టిగా వాదించారని తెలిపారు. 
 
 అనంతరం మాజీ మంత్రి శ్రీ పరసారత్నం మాట్లాడుతూ, 52 ఏళ్ల రాజ‌కీయ ప్ర‌స్థానంలో త‌ర‌త‌మ భేదాలు లేకుండా అంద‌రికీ విశేషంగా సేవ‌లందించిన అజాత‌శ‌త్రువు శ్రీ జ‌గ్జీవ‌న్‌రామ్ అన్నారు. తన రాజకీయ జీవితంలో అనేక మంత్రి పదవులు పొందారని, కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిగా దేశంలో హ‌రిత విప్ల‌వం తీసుకొచ్చి దిగుబ‌డులు పెంచిన ఘ‌నత వారికే ద‌క్కుతుంద‌న్నారు.
 
డిఎల్ఓ శ్రీ వరప్రసాదరావు మాట్లాడుతూ, శ్రీ జ‌గ్జీవ‌న్‌రామ్ దళితులకు రిజర్వేషన్ల సాధనకు ఎంతగానో కృషి చేశారని చెప్పారు. మహిళల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారని చెప్పారు. మహిళకు నిబంధనలు విధించకుండా స్వేచ్ఛగా ఎదగనిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్నారు.
 
అంతకుముందు టిటిడి అధికారులు, ఉద్యోగులు శ్రీవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి, బాబు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సంద‌ర్భంగా విశేష సేవ‌లందించిన ఉద్యోగులకు జ్ఞాపిక‌లు, వ్యాస‌ర‌చ‌న‌, క్విజ్ పోటీల్లో గెలుపొందిన వారికి బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు.
 
ఈ కార్యక్రమంలో టీటీడీ సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీ ఆనందరాజు, ఎస్‌సి సెల్‌ లైజన్‌ ఆఫీసర్‌ శ్రీ దేవేంద్ర బాబు, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.

No comments :
Write comments