Showing posts with label కర్మల నుండి విముక్తులవ్వాలంటే ఏం చేయాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!. Show all posts
Showing posts with label కర్మల నుండి విముక్తులవ్వాలంటే ఏం చేయాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!. Show all posts

10.11.21

కర్మల నుండి విముక్తులవ్వాలంటే ఏం చేయాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!

   

కర్మల నుండి విముక్తులవ్వాలంటే ఏం చేయాలో చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (30 - 34 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 30 నుండి 34 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/dtyn2ylGSPQ ]

కర్మల నుండి విముక్తులవ్వాలంటే ఏం చేయాలో, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా ।
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః ।। 30 ।।

అన్ని కార్యములనూ నాకు అర్పితముగా చేసి, పరమేశ్వరుడైన నాయందే, నిరంతరం నీ ధ్యాస ఉంచుము. ఆశా, స్వార్ధ చింతనా, మరియు మానసిక శోకమునూ వీడినవాడవై యుద్ధం చేయుము!

దేవునిపై ఆధారపడి, కర్మలను నిర్వహించాలి. ఎందుకంటే, అదే జీవుని సహజ స్థితి. భగవానుని ఆజ్ఞలకు లోబడి జీవించడమే, నిజమైన స్థితి. కాబట్టి, ఆయన సహకారము లేకుండా, జీవుడు స్వయంగా ఆనందాన్ని అనుభవించలేడు. అందుకే, శ్రీ కృష్ణుడు అర్జునుడిని యుద్ధము చేయమని బోధిస్తున్నాడు. భగవానుని సత్సంకల్పం కోసం, మానవుడు సర్వమూ త్యాగం చేయడమే కాకుండా, విద్యుక్త ధర్మములను కూడా, ఎటువంటి మమకారం లేకుండా నిర్వహించాలి. కర్మఫలములకు ఆశింపక, ప్రభువు యొక్క ఆజ్ఞననుసరించి నడుచుకోవాలి. అంటే, ఒక గుమాస్తా తన యజమాని ధనాన్ని లక్షల్లో లెక్కించినా, ఒక్క పైసాను కూడా తీసుకోలేడు. ఆ విధంగానే, ఈ జగత్తు ఏ వ్యక్తికీ చెందినది కాదు. ప్రతి మానవుడూ, తన గుణమూ మరియు స్థితిననుసరించి, ఒక ప్రత్యేకమైన కర్మననుసరించాల్సి ఉంటుంది. ఆ కర్మను భగదర్పితం చేసినట్లయితే, ముక్తిని పొందగలడు.

యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః ।
శ్రద్ధావంతోఽనసూయంతో ముచ్యంతే తేఽపి కర్మభిః ।। 31 ।।

పూర్తి శ్రద్ధ, విశ్వాసంతో, దోష విచారణ లేకుండా, నా ఈ బోధను పాటించే వారు, కామ్యకర్మ బంధముల నుండి విముక్తులవుతారు.

భగవద్గీతలోని ఉపదేశాలను విశ్వాసంతో స్వీకరించి, వాటిని శ్రద్ధగా పాటిస్తే కలిగే ఫలితాలను, శ్రీ కృష్ణుడు బోధిస్తున్నాడు. సత్యాన్ని తెలుసుకుని మన జీవితాలను మార్చుకోవడమే, మనం చేయవలసిన విశేష ధర్మం. అలా చేయడం వలన, కామం, క్రోధం, లోభం, ఈర్ష్యా, మాయ అనబడే మానసిక రోగాలు తొలగిపోతాయి.

యే త్వేతదభ్యసూయంతో నానుతిష్ఠంతి మే మతమ్ ।
సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః ।। 32 ।।

కానీ, నా ఈ బోధనలో లోపాలను వెతికేవారు, జ్ఞానం-విచక్షణలు లోపించి, ఈ సిద్ధాంతములను నిర్లక్ష్యముచేసి, తమ భ్రష్టత్వాన్ని కోరి తెచ్చుకుంటారు.

మన ప్రాపంచికమైన బుద్ధి, అసంఖ్యాకమైన దోషాలతో ఉంటుంది. కాబట్టి, ఆయన ఉపదేశ ఔన్నత్యాన్ని కానీ, దాని ప్రయోజనాన్ని కానీ, అన్ని సార్లూ అర్థం చేసుకోలేము. భగవద్గీతలో అర్థమయ్యే భాగాన్ని, మనస్ఫూర్తిగా స్వీకరించి, అవగతం చేసుకోవడమే కాక, నిగూఢమైన, అర్థం కాని విషయాలు, భవిష్యత్తులో అర్థమవుతాయని ఆశిస్తూ, నమ్మకంతో, శ్రీ కృష్ణుడిపై విశ్వాసముంచాలి. కానీ, అహంకారం అనేది ప్రాపంచిక బుద్ధికి ఎప్పుడూ ఉండే ఒక దోషం. అది, మనం అర్థం చేసుకోలేనిదాన్ని, తప్పుగా చూపిస్తుంది. ఈ విషయంపై విచక్షణా జ్ఞనం లేనివారు, తమ వినాశనాన్ని తామే కొనితెచ్చుకుంటారు. వారు శాశ్వతమైన మోక్ష మార్గాన్ని తిరస్కరించి, జనన-మరణ చక్రంలో పడి, తిరుగుతుంటారు.

సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ।
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి ।। 33 ।।

వివేకవంతులు కూడా, తమ ప్రకృతి స్వభావాన్ని అనుసరించి, పనులు చేస్తారు. అన్ని ప్రాణులూ, తమ తమ సహజ ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటాయి. దీనిని నిగ్రహించటం వల్ల ఏమి ప్రయోజనం?

జనులు తమ తమ సహజ స్వభావాలచే ప్రేరేపించబడి, తమ వ్యక్తిగత ప్రవృత్తికి అనుగుణంగా నడుచుకుంటారు. ఎటువంటి వారైనా సరే, అనంతమైన పూర్వ జన్మ సంస్కారాలనీ, ఈ జన్మ యొక్క ప్రారబ్ధ కర్మనీ, వారి మనోబుద్ధుల యొక్క ప్రత్యేక లక్షణాలనీ కలిగి ఉంటారు. గత అలవాట్లు, స్వభావాల బలీయమైన శక్తిని నిగ్రహించడం, చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు, దానిని భగవంతుని దిశగా కేంద్రీకరిస్తే, అది ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది. అర్జునుడు ఒక క్షత్రియ యోధుడు కాబట్టి, తన స్వభావమే యుద్ధానికి ప్రేరిపిస్తుంది. తనలో సహజంగా జనించే ఆలోచనే, దానికి ప్రోద్బలాన్ని కలిగిస్తుంది.  మన లక్ష్యాలను ప్రాపంచిక భోగాల నుండి తప్పించి, భగవత్ ప్రాప్తి దిశగా మార్చడం ద్వారా, మనం కలిగి ఉండే సహజ స్వభావాన్ని పవిత్రం చేసుకోవాలి.

ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ ।
తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపన్థినౌ ।। 34 ।।

ఇంద్రియములు సహజంగానే, ఇంద్రియ విషయములపై రాగ ద్వేషములు కలిగి ఉంటాయి. కానీ, వాటికి వశము కాకూడదు. ఎందుకంటే, ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు.

మన భౌతిక శరీరం ఉన్నంత కాలం, దాని నిర్వహణ కోసం, ఇంద్రియ విషయములను ఉపయోగించుకోవాలి. పూర్వ జన్మ సంస్కారములు, అన్ని ప్రాణుల మీదా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అవి సహజంగానే, ఇంద్రియ విషయముల వైపుగా పరుగులుతీస్తాయి. వాటి యొక్క పరస్పర సహచర్యం, సుఖ దు:ఖ అనుభూతులను కలుగచేస్తుంది. మనస్సు, ఇంద్రియ విషయముల ద్వారా కలిగే ఆనంద, దు:ఖాలను, నిత్యం స్మరిస్తూ ఉంటుంది. మనకు ఆనందాన్నీ, సుఖాన్నీ కలిగించే వాటి మీద చింతనా, మనస్సుకి వాటి మీద ఆసక్తీ కలిగేలా చేస్తుంది. అదేవిధంగా, దు:ఖ హేతువుల మీద చింతన, ద్వేషాన్ని కలిగిస్తుంది. మనం ప్రాపంచిక విధులను నిర్వర్తించేటప్పుడు, మనకు అన్ని రకాల అనుకూల, ప్రతికూల పరిస్థితులూ ఎదురవుతాయి. సుఖాల కోసం ప్రాకులాడకుండా, దు:ఖాలనుండి పారిపోకుండా ఉండడానికి, మనం అభ్యాసం చేయాలి. మనో ఇంద్రియముల ఇష్టా-అయిష్టములకు బానిసలై పోకుండా ఉంటే, మనం నిమ్న స్వభావాన్ని అధిగమించినట్లే. అలా ఉండాలంటే, రాగ ద్వేషాలలో వేటికీ వశం కాకుడదు.

ఇక మన తదుపరి వీడియోలో, స్వధర్మ నిర్వహణ గురించి, శ్రీ కృష్ణుడి వివరణను తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!